February 15, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

డ్వాక్రా మహిళలతో విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమం..

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో కలిసి విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలపై నేరాలు, అనధికార చిట్టీలు, మాదకద్రవ్యాలు వలన అనర్ధాలు మరియు వాటికి సంబంధించిన చట్టపరమైన రక్షణలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు.

ప్రజలకు చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మహిళలపై జరుగుతున్న నేరాలపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని, ఎలాంటి సమస్య ఎదురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, అత్యవసర హెల్ప్‌లైన్లు, చట్టపరమైన హక్కులపై వివరించారు.

సైబర్ నేరాల విషయంలో ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, OTP మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా లింకులకు స్పందించవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు తెలియజేశారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌తో పాటు కుటుంబాలు నష్టపోతుందని పోలీసులు హెచ్చరించారు. మత్తు పదార్థాల బారిన పడితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం, నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు.
మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని, కఠిన శిక్షలు ఉన్నాయని వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

రోడ్డు భద్రత అంశంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం అనంతరం నిర్వహించిన ర్యాలీలో డ్వాక్రా మహిళలు చురుకుగా పాల్గొని, నేరరహిత సమాజం, మహిళల భద్రత, రోడ్డు భద్రత నియమాలు, సైబర్ భద్రతపై నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ప్రజలతో కలిసి పనిచేసినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమని, మహిళల భద్రత, ప్రజాభద్రతే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీస్ శాఖలు స్పష్టం చేశాయి.

TOP